తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకం, హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 12 గంటల పాటు పోలింగ్ సాగింది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదయింది. నవంబర్ 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు.