ఈటలకు పట్టిన గతే నాకూ పడుతుందా? : మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్

0
125

 

బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ప్రస్తుత మంత్రి జి జగదీష్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకు ఈటలకు పట్టిన గతే పడుతుందని కొందరు పగటి కలలు కంటున్నారని, వారి కలలు ఎప్పటికీ నెరవేరవని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చురకలు వేశారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మల్లయ్య యాదవ్, పైలా శేఖర్ రెడ్డి, భాస్కర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి అసెంబ్లీలోని టీఆర్ ఎస్ ఎల్ పి ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన కామెంట్స్ :

ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరడం హాస్యాస్పదం. ఆయన చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. రాజేందర్ హిట్లర్ వారసుల సరసన చేరారు. నేతి బీర కాయ లో నేతి చందంగా ఉంది రాజేందర్ వైఖరి. టీ ఆర్ ఎస్ లోఆయనకు సమస్యలు పెద్దగా లేవు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవి.

ప్రజలంతావ్యతిరేకిస్తున్న పార్టీ బీజేపీ. మొన్నటి దాకా బీజేపీ ని తిట్టిన ఈటెల ఇపుడు ఆ పార్టీ ఏం మారిందని చేరాడు ? బీజేపీ అన్నింటా విఫలమయింది. మునిగి పోయే పడవ లో ఈటెల ఎక్కారు ..ఆయన తో పాటు చేరే వారు కూడా మునిగి పోయేవారే. ఒక్క సంక్షేమ పథకం కూడా బీజేపీ తేలేదు. టీ ఆర్ ఎస్ కన్నా బీజేపీ ఏ విధంగా మెరుగు?

హుజూరా బాద్ ప్రజలకు ఈటెల ద్రోహం చేశారు. ఈటెల బీజేపీ లో చేరడం పై సమాధానం చెప్పాలి. ప్రతీ పార్టీ లో అభిప్రాయ భేదాలు సహజం. ఈటెల కు ముందు నుంచే ప్రత్యేక ఎజెండా ఉందని బీజేపీ లో చేరడం ద్వారా రుజువైంద. హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారు. రాజేందర్ బీజేపీ తో పాటే మునిగి పోతారు. డెబ్బయ్ సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో కెసిఆర్ చేసి చూపించారు.

తెలంగాణాలో ఇపుడు ఆకలి చావులు ,ఆత్మహత్యలు లేవు. 2014  కు ముందు పరిస్థితి ఎలా ఉందిఇపుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. కోటి టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ పంజాబ్ ను దాటిపోయింది. విద్యుత్ లో తెలంగాణ గుజరాత్ ను మించిపోయింది. అన్ని రంగాల్లో కెసిఆర్ పాలనా దక్షత తో తెలంగాణ అగ్రబాగానా ఉంది. టీ ఆర్ ఎస్ ను వీడిన వాళ్ళే నష్టపోతారు పార్టీ కి ఏం కాదు.

గుంపు ను వదిలి అడవి లోకి వెళితే సింహాల పాలు కావడమే. ఈటెల తన పై విచారణ పూర్తి అయ్యేదాకా  టీ ఆర్ ఎస్ లోనే ఉండాల్సింది. కొందరు శత్రువులు నాకు కూడా ఈటెల గతి పడుతుందని కలలు కంటున్నారు. కలలో కూడా అది జరగదు. భూముల అమ్మకం తెలంగాణ అభివృద్ధి కోసమే.

ఎన్నికల కోసం టీ ఆర్ ఎస్ నిర్ణయాలు తీసుకోదు. సంక్షేమం నిర్విరామం గా కొనసాగుతుంది. ఎన్నికల మేనిఫెస్టో ను కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ టీ ఆర్ ఎస్. ప్రజల ఆలోచనలకనుగుణంగా పాలన చేసే పార్టీ టీ ఆర్ ఎస్. రేషన్ కార్డులు ఇస్తామని నాలుగు నెలల క్రితమే చెప్పాము.