తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నోటికి పని చెప్పారు. నోటి నిండ గబ్బుమాటలు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉన్న విషయం మరచిపోయి అనాగరికుల కంటే హీనంగా కామెంట్స్ చేశారు. ఇవన్నీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబోకులోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్ ఇలాంటి తిట్లు ఇంకా చాలా వినియోగించి రెచ్చిపోయారు.
అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ ఛాలెంజ్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడే అయితే పిసిసి చీఫ్ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తను కూడా తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్లే హీరో అని ఒప్పుకుంటానని, ఒకవేళ తాను ఓడిపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు.
అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే సమయంలో నిలబడి తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఆడిబోకులోడి లెక్క మాట్లాడుడు కాదు… మగాడివే అయితే ఇద్దరం రాజీనామాలు చేద్దాం రా… అని అన్నారు.
ఇక తనను పాలు అమ్ముకునేవాడు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని మల్లారెడ్డి తప్పుపట్టారు. పాలు అమ్ముకుంటే తప్పా? యాదవులు పాలు అమ్ముకుంటారు… వాళ్లు తుప్పు చేస్తున్నట్లా? అని నిలదీశారు. మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి పసలేని దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలని రేవంత్ రెడ్డికి చురకలు వేశారు. పెద్ద మనిషినైన నన్ను పట్టుకుని బ్రోకర్ అంటడా? జోకర్ అంటడా అని నిలదీశారు. ఎంతో మందికి చదువు చెప్పానని, ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేశానని గర్వంగా చెప్పుకున్నారు. కష్టపడి సంపాదించుకున్న తనను రేవంత్ రెడ్డి అనరాని మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రోకర్ గిరీ చేసిన రేవంత్ రెడ్డి పిసిసి ప్రసిడెంట్ అయ్యాడని, తాను ఎప్పుడూ బ్రోకర్ గిరీ చేయలేదన్నారు. మల్లారెడ్డి కాలేజీల్లో అవకతవకలు ఏమీ లేవని పార్లమెంటులో రేవంత్ రెడ్డికి చెంపమీద కొట్టినట్లు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని అన్నారు. కావాలంటే ఆ కాయితాలు బయటపెడతానన్నారు.
తెలంగాణలో సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అమవుతున్నాయో చూపించాలని సవాల్ చేశారు. కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయినా అమలవుతున్నాయా అని నిలదీశారు. ఈ మీడియా సమావేశంలో పార్ట నేతలు కెపి వివేకానంద గౌడ్, శంబీపూర్ రాజు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.