మహిళా ఉపాధ్యాయులపై రాజస్ధాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్ర వివాదాస్పద వ్యాఖలు చేశారు. మహిళా టీచర్లు తమలో తాము కలహాలకు దిగుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..ఏ స్కూల్‌లో మహిళా టీచర్లు ఎక్కువగా ఉంటే అక్కడ పలు కారణాల వల్ల గొడవలు జరుగుతాయని స్పష్టం చేశారు. మీరు ఈ చిన్న పొరపాట్లు చక్కదిద్దుకుంటే మీరు ఎప్పటికీ పురుషుల కంటే ముందుంటారని వ్యాఖ్యానించారు.
మహిళల భద్రతతో పాటు వారి సౌకర్యం కోసం రాజస్ధాన్ ప్రభుత్వం భద్రత సహా పలు చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఉద్యోగాల్లోనూ మహిళలకు మెరుగైన పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉద్యోగాలు, సెలెక్షన్, పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. కొవిడ్-19 విద్యారంగంలో చిన్నారులు, పేదలపై పెను ప్రభావం చూపిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారితో రెండు పూటలా తిండి కోసం కూడా పలువురు పడరాని పాట్లు పడ్డారని మంత్రి పేర్కొన్నారు.