గొర్రెల పంపిణీలో నగదు బదిలీ, అప్పుడే అవినీతికి చెక్ : ఉడుత రవిందర్

0
77

గొర్రెల పంపిణీలో అవినీతి జరుగకుండా నగదు బదిలీ చేసి, గొర్రెల పంపిణీ చేపట్టాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ కోరారు. గొర్రెల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా గొల్ల కురుమలకు నగదు బదిలీ చేసి, వారికి నచ్చిన చోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని, నిలిచిపోయిన గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని రవిందర్ కోరారు.

సోమవారం రోజు రాష్ట్ర గొర్రెల పెంపకందార్ల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రాంచందర్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవిందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కురుమ యాదవుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో 50శాతం మందికే ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారు. సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా రెండు నెలల క్రితం తిరిగి ప్రారంభించారు.

రాష్ట్ర బడ్జెట్ లో కూడా ₹3000 కోట్లు కేటాయించారు. కానీ కరోనా పేరుతో మళ్లీ నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల మంది డి.డి.లు తీసి మూడేండ్లుగా వేచిచూస్తున్నారు. గతంలో ఇచ్చిన యూనిట్లలో CPTలు, పశువైద్యులు మరియు మధ్య దళారీలతో కుమ్మక్కై, యూనిట్ కు 21 గొర్రెలకు బదులు 09 నుండి 13 వరకే పంపిణీ చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.

ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే నగదు బదిలీ ద్వారా గొల్ల కురుమలకు నచ్చినచోట, ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునేవిధంగా గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ పై ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.