ధరణి శరణం గచ్ఛామి – ఫణిగిరి గ్రామంలో భూన్యాయ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొన్న రైతులు

రైతుల‌ భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉచితంగా న్యాయ స‌ల‌హాలు

0
80

“ధరణి” శరణం గచ్ఛామి
బుద్ధుడి పాదముద్రలున్న నేల, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఫణిగిరి గ్రామంలో భూన్యాయ శిబిరం
రైతుల భూ సమస్యలకు ఉచిత న్యాయ సలహాలు

రైతుల‌ భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉచితంగా న్యాయ స‌ల‌హాలు అందించేందుకు భూచ‌ట్టాల నిపుణులు న‌డుం బిగించారు. భూన్యాయ శిబిరాల పేరుతో గ్రామాల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. ప్ర‌ముఖ భూచ‌ట్టాల న్యాయ నిపుణులు, న‌ల్సార్ విశ్వ‌విద్యాలయ అనుబంధ అచార్యులు భూమి సునీల్‌, సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు, తెలంగాణ రెవెన్యూ మాస‌ప‌త్రిక సంపాద‌కులు వి.ల‌చ్చిరెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ శిబిరాలు జ‌రుగుతున్నాయి. లీగ‌ల్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆండ్ అసిస్టెన్స్ ఫ‌ర్ ఫార్మ‌ర్స్ సొసైటీ(లీఫ్స్‌), గ్రామీణ న్యాయ పీఠం సంస్థ‌, తెలంగాణ రెవెన్యూ మాస‌ప‌త్రిక క‌లిసి ఈ శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ల్యాండ్ ఆండ్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాక్టీష‌న‌ర్స్ ద రూర‌ల్ లా ఫ‌ర్మ్‌(లాప్‌), తెలంగాణ సోష‌ల్ మీడియా ఫోర‌మ్ సంస్థ‌లు ఈ కార్య‌క్ర‌మానికి సహ‌కారం అందిస్తున్నాయి.

ఈరోజున సూర్యాపేట జిల్లా, నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించాం.
న్యాయ‌వాదులు, రెవెన్యూ నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని భూస‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రైతుల‌కు ఉచిత న్యాయ స‌ల‌హాలు అందించారు. రైతుల వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌ను, ధ‌ర‌ణిలో, ఆన్‌లైన్‌లో ఉన్న‌ రికార్డుల‌ను కూడా ప‌రిశీలించి వారికి త‌గు స‌ల‌హాలు ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న భూస‌మ‌స్య ఏంటి ? ఎలా ప‌రిష్క‌రించుకోవాలి ? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి ? అనే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ శిబిరానికి సుమారు 200 మందికి పైగా రైతులు పాల్గొని వారి స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. వారికి న్యాయ నిపుణులు త‌గు స‌ల‌హాలు సూచ‌న‌లు అందించారు. *ఈ కార్య‌క్ర‌మంలో భూచ‌ట్టాల న్యాయ నిపుణులు, న‌ల్సార్ విశ్వ‌విద్యాలయ అనుబంధ అచార్యులు భూమి సునీల్‌, తెలంగాణ తహశీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చి రెడ్డి, సీనియర్ న్యాయవాది మేక సురేష్ రెడ్డి, న్యాయ‌వాదులు జీవ‌న్, మ‌ల్లేష్‌, రవి సందీప్‌,
తెలంగాణ సోష‌ల్ మీడియా ఫోర‌మ్ అధ్య‌క్షులు దేశాయి క‌రుణాక‌ర్ రెడ్డి, ఉపాధ్య‌క్షులు దాయ‌ని క‌రుణాక‌ర్ రెడ్డి, సూర్యాపేట సోష‌ల్ మీడియా ఫోర‌మ్ అధ్య‌క్షులు పులిగిల్ల వీరమల్లు, గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహా రావు, ప్యాక్స్ మాజీ డైరెక్టర్ గుత్తకండ్ల అశోక్ రెడ్డి, వార్డ్ మెంబర్ కడారి పద్మయ్య ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా భూమి సునీల్ మాట్లాడుతూ తెలంగాణలో భూ సమస్యలు తీరాలంటే ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూ వివాద పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని అన్నారు. భూ పరిపాలన యంత్రాంగాన్ని గ్రామ స్థాయి నుండి పటిష్ట పరిస్తేనే రైతులకు మేలని తెలంగాణ తహశీల్దార్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. జయ శంకర్ సారు ఆశించిన తెలంగాణ సాకారం కావాలంటే భూ సమస్య తీరాలని సీనియర్ న్యాయవాది మేక సురేష్ రెడ్డి అభప్రాయపడ్డారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని కరుణాకర్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలని లీఫ్స్ ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి శిబిరాల రాబోయే రోజుల్లో ఇతర గ్రామాలలో కూడా నిర్వహిస్తామని అన్నారు.