ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సినీ నటుడు మహేశ్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..మొదటగా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఆయన మొదటి నుంచీ చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ఇటీవల సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు వచ్చాయని చెప్పారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారని ఆయన ప్రకటించారు. వారం/పది రోజుల్లోనే ఆ శుభవార్త వస్తుందని చెప్పారు.
టికెట్ ధరల వివాదానికి శుభం కార్డు పడిందని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. ఏపీ సీఎం నిర్ణయం అందరినీ సంతోషపర్చిందని చెప్పారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమని తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలకు మంచి వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి మొత్తానికి నేటితో తెరపడినట్టే అనిపిస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ..సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.