ప్రగతి భవన్ ముట్టడిస్తం : సీరియస్ వార్నింగ్

0
96

రైతుల‌పై కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌…
వ‌రిధాన్యం కొనుగోలులో రైతుల‌కు రూ. 600 కోట్ల బ‌కాయిలు
రైతుల ప‌ట్ల టీఆర్ఎస్ స‌ర్కార్ చిన్న‌చూపు చూస్తుంది
క‌మీష‌న్లు వ‌చ్చే వాటికే బిల్లులు మంజూరు చేస్తున్నారు
నాట్లు వేసే స‌మ‌యం దగ్గ‌ర‌ప‌డ్డ రైతుల‌కు ఇంకా బిల్లులు ఇవ్వరా…?
వెంట‌నే నిధులు విడుద‌ల చేయాలి
లేదంటే ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డిస్తాము.
సీఎంకు బ‌హిరంగ లేఖ‌లో భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూప‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వ‌రి ధాన్యం బ‌కాయిలు ఇంకా రూ. 600 కోట్లు చెల్లించాల‌ని బ‌హిరంగ లేఖ రాశారు.

ఈ లేఖ‌లో సీఎం కేసీఆర్ రైతుల‌కు ఇంకా చెల్లించ‌కుండా రూ. 600 కోట్ల వరి ధాన్యం కొనుగోలు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డం లేద‌ని ప్రశ్నించారు. రైతుప్ర‌భుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ స‌ర్కార్ రైతుల ప‌ట్ల చిన్న‌చూపు చూస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు ఎడ్చినా రాజ్యం ఎప్ప‌టికీ బాగుప‌డ‌దు… కాబ‌ట్టి ఇక‌నైనా రైతులు క‌న్నీరు పెట్టుకునే చర్య‌ల‌ను మానుకోవాల‌ని సూచించారు.

వాన‌కాలం పంట ప‌నులు ప్రారంభ‌మై రైతులు నాట్లు వేసుకుంటున్న ఇంకా వరి ధాన్యం కొనుగోలు బ‌కాయి బిల్లులు చెల్లించ‌డం లేదన్నారు. దీని వ‌ల్ల దాదాపు ల‌క్ష మంది వ‌ర‌కు రైతున్న‌లు డ‌బ్బులు రాక ఏమీ చేయాలో పాలు పోని ప‌రిస్థితి నెల‌కొందని దుయ్య‌బ‌ట్టారు. ఇకనైనా క‌ళ్లు తెరిచి రైతుల‌కు రావాల్సిన డ‌బ్బులను మంజూరు చేయాల‌న్నారు.

కేసీఆర్ క‌మీషన్లు వ‌చ్చే ప్రాజెక్టుల‌కు ఆగ‌మేఘాల మీద నిధులు విడుద‌ల చేసి.. రైతుల విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అస‌లు మీకు రైతులంటే ఎందుకు అంతా చిన్న‌చూపు.. దేశానికి ప‌ట్టెడ‌న్నం పెడుతున్నందుకా..? లేదా మీరు ఎం చేసిన రైత‌న్న ఎదురు తిర‌గ‌డు కాబ‌ట్టా…? అని ప్ర‌శ్నించారు.

వెంట‌నే రైతులకు బ‌కాయిప‌డ్డ రూ. 600 కోట్లు నిధులు విడుద‌ల చేయ్యాలని లేదంటే రైత‌న్న‌ల‌ను వెంట‌బెట్టుకుని ప్రగతి భవన్ ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడి చేస్తామని ఆల్టిమేటం జారీచేశారు.