అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు (Magunta Sreenivasulu reddy) ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం.. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్టసభలకు పోటీ చేశాం. ఒంగోలు తమకు రాజకీయ జీవితం ఇచ్చింది. మా కుటుంబానికి అహం లేదు.. ఆత్మగౌరవమే ఉంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట తెలిపారు.
కాగా ఇటీవల ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ నియమించారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న మాగుంట.. తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఎన్నికల వేల ఇప్పటివరకు మొత్తం ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక్క రాజ్యసభ ఎంపీ రాజీనామా చేయడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.