టిఆర్ఎస్ పార్టీ కండువా గొడ్డలి లాంటిది. దాన్ని మెడకు వేసుకోవడమంటే ప్రమాదాన్ని ఎత్తుకున్నట్లే అన్నారు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. ఆయన మంగళవారం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినందుకు మనస్పూర్తిగా అభినందించినట్లు చెప్పారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన తాను కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందని బాధపడ్డారు. తన తండ్రి కోసమే మధ్యలో కొంతకాలం టిఆర్ఎస్ లో చేరానని చెప్పారు. కానీ టిఆర్ఎస్ కండువా గొడ్డలి లాంటిది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టిఆర్ఎస్ అనేది రాజకీయ పార్టీయే కాదన్నారు. జిల్లా ప్రెసిడెంట్ కు ఆ పార్టీలో ఏమాత్రం గుర్తింపు లేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్ కు వస్తున్నాని ప్రకటించారు.
త్వరలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతానని చెప్పారు. అతి త్వరలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు మేలు చేస్తుందని, టిఆర్ఎస్ లాంటి పార్టీలు కుటుంబ పార్టీలే అని విమర్శలు చేశారు ధర్మపురి సంజయ్.
ధర్మపురి సంజయ్ తో పాటు రేవంత్ రెడ్డిని మహబూబన్ నగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టిడిపి భూపాలపల్లి నియోజకవర్గ నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు.
అతి త్వరలో తాము కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతామన్నారు. ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఎర్ర శేఖర్ అభిప్రాయపడ్డారు.