విద్యార్ధులకు నో బ్యాగ్ డే – అకాడమిక్‌ క్యాలెండర్ రిలీజ్..సెలవులు ఇవే..

0
76

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్కార్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

అలాగే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా అకడమిక్ కేలండర్ విడుదల చేసింది. ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది మాత్రం జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలలు 220 రోజులు పని చేస్తాయి. 1-9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయి. ఈ మేరకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. మరోవైపు వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ ఉంటుందని పేర్కొన్నారు.

సెలవులు ఇలా..

సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6వరకు దసరా సెలవులుగా ఖరారు చేసారు.

డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు క్రిస్మస్ సెలవులుగా నిర్దారించారు.

క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు.

సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయని కేలండర్ లో స్పష్టం చేసారు.