తెలంగాణ సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు శ్రవణ్. సమావేశంలో ఆయన ఏమన్నారో చదవండి…
”ప్రభుత్వం భూములు కాపాడటానికి కాంగ్రెస్ హాయంలో చాలా కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో విడుదల చేసిన లాండ్ మ్యానేజ్మెంట్ అథారిటీ జీవోని చాలా మంది పెద్దలు, మేధావులు, నిపుణులు సమక్షంలో రాజ్యంగబద్దంగా జీవోని తయారుచేశారు. ఒక్కరాత్రిలో విడుదల చేసిన జీవో కాదు. అసలు భూ అవసరాలు ఏ విభాగాలకు ఉంటాయని, అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన వారితో 14మార్చ్ 2011న ఒక హైలెవల్ మీటింగ్ జరిగింది. 11 మే 2011న డ్రాఫ్ట్ ని అన్ని డిపార్ట్మెంట్ లకు పంపీ మళ్ళీ లోటుపాట్లు చర్చించారు. 10 జూన్ 2011 అన్ని రాజకీయ పార్టీలకు ఆ డ్రాఫ్ట్ పంపించి 28 నవంబర్ 2011న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
ఈ అఖిల పక్ష సమావేశంలో అధికార పక్షం కాంగ్రెస్ నుండి రఘువీర రెడ్డి, బొత్స సత్యనారాయణ, గీతరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంత కుమార్, శైలజానాద్ తో పాటు దాడి వీరభద్రరావు, రావుల చంద్రశేఖర్ (టీడీపీ) రాఘవులు, మధు( సిపీఎం ) నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి ( సిపిఐ ) బండారు దత్తత్రేయ, యస్ మల్లా రెడ్డి (బిజెపి ) జయప్రకాష్ నారాయణ, లక్ష్మణ్ బాలాజీ (లోక్ సత్తా) , టీఆర్ఎస్ నుండి దాసోజు శ్రవణ్ అనే నేను, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్లాం. కేసీఆర్ సలహాలు సూచనలు మేరకు నేనే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వ భూములు అమ్మొద్దు, వ్యవసాయ భూములని అభివృద్ధి పేరుతో కంపెనీలకు కేటాయించవద్దు..ఇచ్చిన భూములు అనవసరంగా వినియోగం లేకుండా వుంటే వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తరపున డ్రాఫ్ట్ సమర్పించాం. మరి ఇప్పుడు ఏమయింది ? నాడు భూములు కాపాడాలని చెప్పిన కేసీఆర్ .. నేడు భూములు ఎందుకు అమ్ముకుంటున్నారు ? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా ప్రభుత్వ భూములు అమ్మడానికి వీలు లేదని చెప్పిన కేసీఆర్ .. నేడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ? ఇదేం న్యాయం ? ఇదెక్కడి పాలన ? అని నిలదీశారు దాసోజు.