ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రెండు చోట్లా సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడంతోపాటు వెబ్‌కాస్టింగ్ కూడా చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ బరిలో ఉండగా, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు)ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
హుజూరాబాద్‌లో ఉ.9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
ఉపఎన్నిక పోలింగ్‌ను కరీంనగర్ సీపీ పరిశీలిస్తున్నారు. వీణవంక మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ కింది స్థాయి అధికారులను స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటుంన్నారు. పోలింగ్‌ప్రక్రియపై సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఔటర్స్ ఉన్నారంటూ ఒక పార్టీ మరో పార్టీపై ఫిర్యాదు చేసుకుంటుంన్నారు. ఒక్క చోట మాత్రమే ఈవీఎంలు మొరాయించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు అని అన్నారు.