రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. అంతిమంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. వారిలో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఒకరు కాగా…విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రెండో అభ్యర్థి.
రాష్ట్రపతి ఎన్నికకు మొత్తంగా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిలో 107 నామినేషన్లు సరైన పత్రాలతో దాఖలు కానందున ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించింది. వీటిలో 28 నామినేషన్లు దాఖలు సమయంలోనే తిరస్కరణకు గురయ్యాయి. ఇక 79 నామినేషన్లు ఆయా అభ్యర్థులను ప్రతిపాదించిన వారితో పాటు బలపరిచే సభ్యుల సంఖ్య సరిగా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు.
మొత్తం 115 నామినేషన్లలో ముర్ముతో పాటు యశ్వంత్ లు చెరో 4 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరికి చెందిన 8 నామినేషన్లను పక్కనపెడితే… మిగిలిన అన్ని నామినేషన్లు కూడా తిరస్కరణకు గురైనట్లే.
జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.