వారంతా నూతనంగా నియమింపబడ్డ యువ గ్రేడ్-5 పంచాయితీ కార్యదర్శులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రికగా పేరొందిన గ్రామ సచివాలయాల్లో గతేడాది నియమించబడిన గ్రేడ్-5 పంచాయితీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7000 పైగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి నూతన విప్లవం సృష్టించడానికి వీరంతా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే వీరి నియామకం జరిగి రానున్న అక్టోబర్.2 కి ఏడాది పూర్తవుతుంది. కానీ వీరికి ఇప్పటి వరకు అటు అధికార పరమైన, ఇటు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఆయా పంచాయితీల గత కార్యదర్శుల నుంచి ఛార్జ్ అప్పగించ లేదు.
వీరి అధికారాలకు సంబంధించి జీవో నెంబర్ 149, 110 అమలు కావడం లేదు. నూతనంగా నియమించబడిన పంచాయితీ కార్యదర్శులంతా ఛార్జ్ అప్పగించే విషయమై మండల స్థాయి అధికారుల నుంచి, జిల్లా పంచాయితీ అధికారుల వరకు ఎన్ని విన్నపాలు పెట్టుకున్నా అవి మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
ఎటువంటి అధికార, ఆర్థిక పరమైన అధికారాలు లేనప్పటికీ పంచాయితీల అభివృద్ధికి ప్రామాణికమైన నవశకం సర్వే,జీపీ డీపీ,ప్లాన్ ప్లస్ సర్వే లను ఇప్పటికే నూతన కార్యదర్శులు అంతా తామై దిగ్విజయం గా పూర్తి చేశారు. తమకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తే గౌరవ సీఎం కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మరింత సమర్ధ వంతంగా ముందుకు తీసుకొని వెళ్తామని వారు ఘంటా పథంగా చెప్తున్నారు..