పవన్ కల్యాణ్ కోర్టు మెట్లెక్కక తప్పదా..?

పవన్ కల్యాణ్ కోర్టు మెట్లెక్కక తప్పదా..?

0
158

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.ఈ నెల ఇరవై నాలుగో తేదీన హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా.. న్యాయవాది ద్వారా హాజరు కావాలని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి ఆదేశించింది. కొద్ది రోజుల కిందట టాలీవుడ్‌లో శ్రీరెడ్డి అనే నటీమణి లేవనెత్తిన వివాదం అటూ.. ఇటూ తిరిగి పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. పవన్ కల్యాణ్‌ను…శ్రీరెడ్డి అసభ్యంగా తిట్టింది. ఆ తిట్టుని టీవీ చానళ్లు లైవ్ చూపించినప్పుడు ఎయిర్‌లోకి వెళ్లిపోయింది. కానీ తర్వాత.. మాత్రం ఆయా టీవీ చానళ్లు ఆ బిట్‌ని మ్యూట్ చేసి ప్రసారం చేశాయి.

కానీ పవన్ కల్యాణ్‌ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మీడియాపై పోరాటం చేయడం ప్రారంభించారు. శ్రీరెడ్డిని ఏమీ అనకుండా.. ఆమెతో మీడియానే చేయిస్తోందని… ప్రధానంగా.. టీవీ నైన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై విరుచుకుపడ్డారు. ఆయా మీడియా సంస్థల యజమానుల ఫోటోలు తన ట్విట్టర్‌లో పెట్టి అనేక ఆరోపణలు చేశారు. దీంతో టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు, ఏబీఎన్ ఏండీ రాధాకృష్ణ విడివిడిగా పరువు నష్టం నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి పవన్ సమాధానం ఇవ్వకపోవడంతో రూ. 10 కోట్ల పరువు నష్టం దావాతో ఏబీఎన్ ఎండీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.

పవన్ కల్యాణ్ .. ఇదే కాక.. టీవీ నైన్ దాఖలు చేసిన మరో మార్ఫింగ్ కేసు కూడా ఎదుర్కొంటున్నారు. టీవీ 9లో ప్రసారం అయిందంటూ.. ఓ క్లిప్‌ను.. ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి అది మార్ఫింగ్ క్లిప్. ఈ విషయంలై టీవీ 9 సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ క్లిప్‌ను పవన్ తన ట్విట్టర్ ద్వారా అప్‌లోడ్ చేశారని.. ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను కూడా తెలుగు 360 గతంలో బయటపెట్టింది. పరువు నష్టం కేసులతో పాటు..పవన్ ఈ కేసును కూడా ఎదుర్కొంటున్నారు.

అయితే పరువు నష్టం కేసుల విషయంలో పవన్ కల్యాణ్ నేరుగా కోర్టుకు హాజరవకుండా మినహాయింపు పొందే అవకాశం ఉంది. లాయర్ల ద్వారా ఈ ప్రయత్నాలు చేయవచ్చు. లేదా మీడియా సంస్థలతో రాజీ చేసుకోవచ్చు. కానీ మొండిగా ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీపై.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ .. అసత్య ఆరోపణలు చేయడంతో… జైట్లీ కోర్టుకెళ్లారు. చివరికి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి తప్పించుకోవాల్సి వచ్చింది.