కాంగ్రెస్ లోకి ప్రజా గాయకుడు గద్దర్‌?..వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ

0
88

తెలంగాణాలో రాజకియం వేడెక్కింది. వరుస వలసలతో పార్టీలలో కలకలం మొదలయింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలతో హస్తం బలం పెరగగా అధికార పార్టీ టిఆర్ఎస్ కు బ్రేకులు పడ్డాయి. ఇక తాజాగా ప్రజా గాయకుడు గద్దర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని గద్దర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరగా.. అందుకు గద్దర్‌ స్పందిస్తూ తెలంగాణలోకి రాహుల్‌గాంధీ యాత్ర ప్రవేశించాక ఆయనతో కలిసి నడుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరితో మరింత బలం వస్తుందని భట్టి సూచించగా.. అందుకు గద్దర్‌ కూడా సానుకూలంగానే స్పందించారు. కాంగ్రెస్‌లో చేరి పార్లమెంటరీ డెమోక్రసీలో పాల్గొని పార్లమెంటుకు పోటీ చేయాలని గద్దర్‌ను భట్టి కోరారు.

పార్లమెంటుకు పోటీ చేసే విషయంలోనూ గద్దర్‌ సానుకూలంగానే స్పందించారు. భట్టి విక్రమార్క, గద్దర్‌ మధ్య జరిగిన చర్చలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు గద్దర్‌ను పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక వేళ గద్దర్‌ కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అంబేద్కర్‌ అని, అలాంటి వ్యక్తి పేరు నూతన పార్లమెంట్‌ భవనానికి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లిలో తీర్మానం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని భట్టిని కోరినట్లు ఆయన తెలిపారు.