ఫోటో గ్రాఫర్ భరత్‌ భూషణ్‌ ఇక లేరు

0
99

తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని తన కెమెరా లెన్స్ లో బంధించి, భద్రపరిచి, ప్రజలకు అందించిన గొప్ప ఛాయా చిత్రకారుడు భరత్ భూషణ్. పోరాటాలు, ఉద్యమాలు, స్రుజనాత్మకత,
ప్రశ్నించే తత్వం, తర్కం ఉన్న ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన బిడ్డ భరత్ భూషణ్‌. ఉదయం దినపత్రికలో సీనియర్ ఫోటో జర్నలిస్టుగా పని చేశారు.

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలు, జీవన విధానంపై భరత్ భూషణ్‌ ఎన్నో ఫోటో ఎగ్జిబిషన్లను నిర్వహించారు. 1997లో వరంగల్ లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (ఎఐపిఆర్ఎఫ్‌) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు సదస్సు, రెండవ రోజు సాయంత్రం
హన్మకొండలో బస్టాండ్ ఎదురుగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దానికి నేను, నాతో పాటు చాలా మంది జర్నలిస్టులు, తెలంగాణ రాష్ట్రాన్ని
కాంక్షించే ప్రజా స్వామికవాదులు అందరూ వెళ్లాము. ములుగు రోడ్డులో ఓ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభకుముందు రెండు రోజులు ఏర్పాటు చేసిన సదస్సు. గద్దర్ పై కాల్పులు జరిపి,
హత్యాయత్నం చేసిన తర్వాత తొలి సారి గద్దర్ ఆ సదస్సు, బహిరంగ సభలకు హాజరయ్యారు.

హత్యా ప్రయత్నం తర్వాత గద్దర్ ఎఐఫిఆర్ఎఫ్‌ సభకు రావడాన్ని వామపక్ష భావజాల
అభిమాన ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గద్దర్ రానే వచ్చారు. తనదైన వేషధారణ, శైలితో గద్దర్ స్టేజీమీద పాటలు మొదలు పెట్టారు. భరత్ భూషణ్‌ తన భుజాన వేలాడుతున్న కెమెరాను ఎత్తి ఫోటోలు తీస్తున్నాడు. ఫ్లాష్‌ ల మీద, ఫ్లాష్‌ లు..పదులు సంఖ్యలో ఫ్లాష్‌ లు మెరుస్తున్నాయి. ఎందుకు ఇంతగనం ఫోటోలు తీస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. సహజంగా నేను కూడా అలాగే అనుకున్నాను. ఇన్ని ఫోటోలు అవసరమా అని. కానీ ఆ కెమెరా కన్ను భరత్ భూషణ్‌ కు మాత్రమే తెలుసు. ఆ ఫోటోల్లో హై లైట్ ఎంటీ అంటే… గద్దర్ పాట పాడుతూ తన చేతిలో ఉన్న ఎర్రజెండాను, కర్రను పైకి ఎగిరేసి పాటల తన్మయత్వంలో తాను పైకి ఎగురుతాడు. గద్దర్, ఆయనతో పాటు ఎర్రజెండా, చేతిలో కర్ర ఇవన్నీ గాల్లోనే ఎగురుతున్పప్పుడు భరత్ భూషణ్ కెమెరాలో ఆ ఫోటో బందించబడింది. అదీ భరత్‌ భూషణ్‌ ఫోటో గ్రఫీ అంటే.

ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫోటోలను తన కెమెరా లెన్స్ లో బంధించి, తెలంగాణకు, తెలుగు జాతికి అందించిన గొప్ప కళాకారుడు
భరత్‌ భూషణ్‌. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ రోజు అంటే, సోమవారం తుది శ్వాశ వదలడం చాలా బాధాకరం. భరత్ భూషణ్‌ ఫోటో గ్రఫీ చరిత్రకు ఒక
మణిభూషణం. ఆయనకు కన్నీటి నివాళి.
-ఎ.రమణ కుమార్,
సీనియర్ జర్నలిస్టు, TUWJ-TEMJU.