కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రెండు వేల రూపాయల సాయం పీఎం కిసాన్ విషయంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. రైతులు ఇకెవైసి లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఇకెవైసి నమోదు విషయంలో వెనుకబడి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అయితే చాలా మంది రైతులకు అవగాహన లేక ఇకెవైసి నమోదు చేయడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను జూలై 31 వరకు పొడిగించింది. అయితే గత మూడు రోజులుగా ఇకెవైసి నమోదు చేసేందుకు ప్రయత్నించినా వెబ్ సైట్ పని చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ప్రయత్నం చేసినా సైట్ అండర్ మెయింటెనన్స్ అని చూపుతుందని వారు వాపోతున్నారు.కంప్యూటర్ కేంద్రాల వద్దకు వెళ్లి ప్రయత్నిస్తే ఇలా రావడంతో వారు హుసూరుమంటూ వెనుదిరిగిపోతున్నారు.
పిఎం కిసాన్ ఇకెవైసి వెబ్ సైట్ ను తక్షణమే పనిలో పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే కొందరు ఇకెవైసి లో తమ ఫోన్, ఆధార్ నెంబర్లను నమోదు చేసుకున్నారు. వారందరికీ రెండు వేల రూపాయల సాయం బ్యాంకుల్లో జమ అయింది. వారికి డబ్బులు రావడం, అప్లై చేసుకోలేని వారికి రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సైట్ ను త్వరగా రిపేర్ చేసి పని చేసేలా చేయాలని రైతులు కోరుతున్నారు.