నేడు ఏపీకి ప్రధాని మోడీ..భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ

0
120

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ విగ్రహం తయారీకి రూ.3 కోట్ల వ్యయం అయ్యిందట. పాలకొల్లు మండలం ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత ఈ రూ.3 కోట్లు విరాళం అందజేశారు. హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన శిల్పి బుర్రా ప్రసాద్‌ ఈ విగ్రహాన్ని 32 రోజులలో తయారు చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం ఉందని తెలిపారు.

ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకుంటారు. వాతావరణం అనుకూలిస్తే అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భీమవరం వెళ్తారు. వాతావరణం అనుకూలించకుంటే గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, నారాయణపురం, గణపవరం మీదుగా భీమవరం చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు.