రాజ్యసభ ఎన్నికల(Rajya Sabha Elections) నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలు అందిస్తారు. లేని పక్షంలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
Rajya Sabha Elections | ఏపీలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీతో వీరి పదవికాలం ముగియనుంది. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో మూడు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు.