పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుతో ఉత్సాహంతో ఉంది. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. పంజాబ్ ఇచ్చిన గెలుపు కిక్ తో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లను నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే పంజాబ్‌లో అటు పార్టీని మరింత బలోపేతం చేయడంపై అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి తాజాగా వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఈ మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో హర్భజన్ సింగ్‌ను త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. పంజాబ్ నూతన సీఎం భగవంత్ మాన్ ఆయనతో చర్చలు జరిపి రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరులో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 5 రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి.
అందులో ఒక స్థానానికి హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. హర్భజన్ సింగ్‌తో పాటు ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జ్ రాఘవ్ ఛద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్‌ను నామినేట్ చేసింది.