ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ టికెట్? సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు..

0
84

బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌ వ్యూాహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు.. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కనిపించడం. ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

టాలీవుడ్ లో అద్భుతంగా నటించి మనందరినీ అలరించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయల్లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రకాష్ రాజ్… తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక అలాగే తమిళనాడులోనూ ప్రకాష్ రాజ్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు.  తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకాష్ రాజ్ కు మంచి అవకాశం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున నటుడు ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రకాష్ రాజు కు గులాబీ బాస్ గా కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాష్ రాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వర‌లో తెలంగాణలో మూడు రాజ్యస‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవ‌కాశం క‌ల్పిస్తే.. జాతీయ స్థాయిలో బీజేపీ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని గులాబీ బాస్ కేసీఆర్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.