ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించడంతోపాటు ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగానే ఉంచింది.
ప్రస్తుత పరిస్థితులు, అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 9.5గా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. మూడో త్రైమాసికంలో 6.6శాతం, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో నికర జీడీపీ వృద్ధిరేటు 17.2 శాతంగా , రెండో క్వార్టర్లో 7.8శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
కోవిడ్ కారణంగా క్షీణించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటుందంటూ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రటకించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఇటీవల పన్నులు తగ్గించిన నేపథ్యంలో వినిమయ గిరాకీ పుంజుకుంటుందని.. అలాగే నవంబరులో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశంగా ఉందన్నారు.