రేవంత్ రెడ్డి దూకుడు..ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌

0
84

తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాయకులు కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అటు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి కారు నుండి బీజేపీలోకి వలసలు జరుగుతున్నాయి. దీనితో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండగా వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ను…వేగం పెంచేదిశలో పావులుకదుపుతున్నారు

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జోరు పెంచారు. పార్టీ ప్రక్షాళన కోసం బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, 36 మంది డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు.. జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి నివేదించారు.

ఇక ఆపరేషన్‌ ఆకర్ష్‌లో పార్టీ సీనియర్లు కొందరు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. తాను అనుకున్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న చోట్ల బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి నివేదించగా.. దానిపై రాజకీయ వ్యూహకర్త సునీల్‌ నుంచి కూడా ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలన్న పట్టుదలతో రేవంత్‌రెడ్డి ఉన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా 90లక్షల ఓట్లు, 70 సీట్ల నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.