గల్లీలో లొల్లి.. ఢిల్లీలో అలయ్ బలయ్..: రేవంత్

గల్లీలో లొల్లి.. ఢిల్లీలో అలయ్ బలయ్..: రేవంత్

0
83

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీది ఉత్తుత్తి ఫైటింగేనని.. గల్లీలో ఫైట్ చేస్తున్నట్లు నటిస్తూ ఢిల్లీలో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ విధానాలను తూర్పారబట్టారు. పార్లమెంట్ సమావేశాలకు ఎప్పుడూ హాజరుకాని ఎంపీ సంతోష్.. ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ ఆర్టీఐ సవరణ బిల్లుకు మద్దతు పలికారని విమర్శించారు. బీజేపీతో టీఆర్ఎస్ ఎప్పటికీ జతకట్టదన్న ఒవైసీ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌పై పోరాటమన్న జితేందర్ రెడ్డి, డీకే అరుణ దీనిపై సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, అమిత్ షా కలిసి నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మీద ఉన్న సహారా కేసు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. మానవ అక్రమ రవాణా వ్యవహారంలో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారని, అదే కేసులో ఉన్న హరీశ్ రావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, దానిపై విచారణకు బీజేపీ ఎందుకు ఆదేశించడం లేదన్నారు. ఈఎస్ఐ కుంభకోణంపై విచారణ ఎంత వరకు వచ్చిందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.