తిట్టిన విహెచ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన రేవంత్ రెడ్డి

0
115

విహెచ్ పేరు చెప్పగానే కాంగ్రెస్ సీనియర్ నేతగా అందరూ గుర్తు పడతారు. అంతేకాదు ఆయన ఇందిరా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు అని ప్రచారం ఉంది. ప్రత్యర్థులు మాత్రం కేసిఆర్ కోవర్టు అని కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. ఇవి పక్కన పెడితే ఏదున్నా మొహం మీద మాట్లాడే తత్వం విహెచ్ ది. కాంగ్రెస్ రాజకీయాలకు కరెక్ట్ పర్సనాలిటీ విహెచ్. కాంగ్రెస్ పార్టీలో ఆమాత్రం నోరు లేకపోతే కూడా నిలదొక్కుకుని ఇంతకాలం ఆ పార్టీలో బతకడం కష్టమైన పనే.

ఇక మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి రాకుండా శాయశక్తులా విహెచ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా తన శక్తియుక్తులన్నీ ఓడ్డారు. బహిరంగ ప్రకటలు గుప్పించారు. సోనియాకు లేఖలు రాశారు. తనకున్న పలుకుబడి మొత్తం ఉపయోగించారు. సీనియర్లను కలుపుకుని రేవంత్ కు అడ్డం పడే ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో కేసిఆర్ కోవర్టు అని విమర్శలు సైతం మూటగట్టుకున్నారు. విహెచ్ కు ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డినే అధిస్టానం నియమించింది.

విహెచ్ ను పరామర్శిస్తున్న చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు రవి

సీన్ కట్ చేస్తే విహెచ్ అనారోగ్యంపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత వరుసబెట్టి సీనియర్లను కలిసి వారి ఆశిస్సులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పిసిసి చీఫ్ ప్రకటన రాగానే పెద్దలు జానారెడ్డిని కలిశారు. అటు వెంటనే షబ్బీర్ అలీని కలిశారు. నిజామాబాద్ నేత, మాజీ ఇరిగేషన్ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఆదివారం కలిశారు. సోమవారం కూడా మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయన ఆశిస్సులు పొందారు. అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు అయిన విహచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి వెళ్లి విహెచ్ ను పరామర్శించారు. త్వరగా ఆసుపత్ర నుంచి కోలుకుని రాజకీయాల్లో యాక్టీవ్ రోల్ పోశించాలని రేవంత్ ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి వెంట సీనియర్ నేతలు చిన్నారెడ్డి, డాక్టర్ మల్లు రవి ఉన్నారు. ఇవాళ ఉదయమే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి చిన్నారెడ్డి అభినందించారు.

ఇక సీనియర్లందరినీ కలుస్తున్న రేవంత్ రెడ్డి నేడో రేపో కోమటిరెడ్డిని కూడా కలిసే ప్రయత్నం చేయనున్నట్లు తెలుసుకున్న కోమటిరెడ్డి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తనను కలవాల్సి అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. డబ్బు మూటలతో పిసిసి తెచ్చుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు లాగే పిసిసి చీఫ్ పదవి కూడా మారిపోయిందని విమర్శలు గుప్పంచారు. హుజూరాబాద్ లో కొత్త టీమ్ డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి మణికం ఠాకూర్ పైనా అవినీతి ఆరోపణలు గుప్పించారు.  రేవంత్ రెడ్డి ఈ రకమైన పరిస్థితుల్లో కోమటిరెడ్డి సోదరులను కలుస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.