కేసీఆర్‌ నకిలీ లౌకిక వాది.. మోదీకి ఏజెంట్ : రేవంత్‌ రెడ్డి

0
74

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నకిలీ లౌకిక వాదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టిపిసిసి)కి నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎంపి ఎ. రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మత శక్తులను ఓడించడానికి మైనార్టీలంతా కాంగ్రెస్‌ పార్టీతో తిరిగి కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో మైనార్టీలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నం అయ్యిందన్నారు.

మాజీ మంత్రి, శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మైనారిటీ నాయకులతో జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. జూలై 7న గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలను అతి చేరదీసిందని బీజేపీ ఆరోపిస్తూ ఎన్నికల్లో ప్రజల్ని విభజించిందని ఆరోపించారు. అయితే ముస్లింలు మాత్రం టీఆర్‌ఎస్‌ వంటి ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారని, టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన తర్వాత జాతీయ స్థాయిలో తిరిగి బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఈ ధోరణి భారతదేశ లౌకికత్వానికి అధిక నష్టాన్ని కలిగించిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఒక సమాజాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయలేదన్నారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

సీఎం కేసీఆర్, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీల ఏజెంట్‌ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు అనేక ఉదాహరణలను ఆయన ఉటంకించారు. కేసీఆర్‌∙మైనారిటీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, మైనార్టీలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులో టిఆర్‌ఎస్‌ ఎంపిలు బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌లను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదని చెప్పారు.. కాంగ్రెస్‌ పార్టీ పదేపదే డిమాండ్‌ చేసినప్పటికీ, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ టిఆర్‌ఎస్‌ను బీజేపీ బి–టీమ్‌గా అభివర్ణించడం వాస్తవమేనన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ రాజకీయ వైరం ఉన్నట్లుగా నటించి తెలంగాణ ప్రజలను మోసం చేసి తప్పుదారి పట్టిస్తున్నాయని రేవంత్‌ ధ్వజమెత్తారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ అమలు చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏడేళ్లు అయినా నేటికీ అమలు చేయకుండా ఇప్పటికీ ముస్లింలను కేసీఆర్‌ మభ్య పెడుతూనే ఉన్నారని నిప్పులు చెరిగారు. ముస్లింకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ హామీని అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చిన 58 రోజుల తర్వాత హైకోర్టు కేసు విచారణ నేపథ్యంలో 5 శాతానికి బదులు నాలుగు శాతం అమలు చేసిందన్నారు. ఈ చర్య ఫలితంగా దాదాపు 20 లక్షల మంది పేద ముస్లింలకు ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ముస్లింలను బిసి–ఇ కోటాను అమలు చేయడంలో షబ్బీర్‌ అలీ పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు. ఆనాడు గులాం నబీ ఆజాద్‌ చేసిన కృష్టిని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి అమలు చేశారని రేవంత్‌రెడ్డి కొనియాడారు.

ముస్లిం సమాజానికి అధికారం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ చేసే వాదనలను రేవంత్‌ రెడ్డి ఎగతాళి చేశారు. ఒక ముస్లింకు హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా, తాను మొత్తం సమాజానికి అధికారం ఇచ్చినట్లుగా కేసీఆర్‌ భావిస్తున్నారని, కేసీఆర్‌ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింను హోం మంత్రి (ఎంఎం హషమ్‌) చేసిందని గుర్తు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా కమాలుద్దీన్‌ను నియమించిందని, ఇటీవలి వరకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా షబ్బీర్‌ అలీ ఉన్నారని కూడా గుర్తు చేశారు. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి ఉన్నత పదవుల్లో ముస్లింలను నియమించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ స్థానంలో ఓడించేందుకు సీఎం కేసీఆర్‌ భారీగా ఖర్చు చేశారని, అదే ప్రయత్నం 2019లో మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారని రేవంత్‌ చెప్పారు. మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు ఎన్నిక అవ్వడంలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ముస్లింల ఆశీస్సులు బాగా ఉన్నాయని అన్నారు. తానెప్పుడూ ముస్లింల శ్రేయస్సు కోరుకుంటానని, ముస్లిం సమాజాన్ని ఎప్పుడూ నిరాశపరచలేదని, లోక్‌సభలో సిఎఎ వంటి మైనారిటీ వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించడంలో ముందున్నానని చెప్పారు. ముస్లింలంతా కాంగ్రెస్‌ పార్టీతో తిరిగి మమేకం కావాలని, టీఆర్‌ఎస్‌ బీజేపీతో రహస్య మైత్రిని గమనించి టీఆర్‌ఎస్‌ను తిరస్కరించాలని రేవంత్‌రెడ్డి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో మహ్మద్‌ షబ్బీర్‌ అలీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వారి స్థాయిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీల సంక్షేమంపై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించిన లేనిపోని బ్రమలను బహిర్గతం చేయాలన్నారు. 2014, 2018 ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోల్లో ముస్లింలకు ఇచ్చిన ఒక్క వాగానాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ‘మైనారిటీలకు మాయ మాటలు చెప్పి సమాన అవకాశాలు కల్పిస్తామని నమ్మించిన కేసీఆర్‌ ఆ ఎన్నికల్లో విజయం సా«ధించారని అన్నారు. మైనార్టీలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారనే కృతజ్ఞత కూడా లేకుండా సీఎం కేసీఆర్‌ ముస్లిం సమాజాన్ని, ముస్లిం సంస్థలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా కేసీఆర్‌ రెండోసారి గెలిచిన తర్వాత ఆగడాలకు అంతులేకుండా పోతోందని నిప్పులు చెరిగారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు మసీదులు, ఇతర మత ప్రదేశాలను కూల్చివేసిందని షబ్బీర్‌ అలీ చెప్పారు. ఉర్దూ అకాడమీ, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలను నిర్వీర్యం చేశారని, వాటికి నిధులు కేటాయింపులు తగ్గించి ఇబ్బందులకు గురిస్తున్నారని, సిబ్బందికి ఇక్కట్లు వచ్చేలా చేశారని అన్నారు. కేసీఆర్‌ ఇప్పుడు మతతత్వ వాదిగా మారారని ధ్వజమెత్తారు. ఇతర సంస్థల్లో ముస్లింలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని, వివిధ యూనివర్సిటీకి చెందిన 10 మందిని వైస్‌–ఛాన్సలర్లుగా ప్రభుత్వం నియమిస్తే అందులో ఒక్కరు కూడా ముస్లిం లేరని చెప్పారు. అదేవిధంగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఒక్క ముస్లింకు చోటు కల్పించలేదన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింల పేరిట ఉన్న సంస్థలు, ప్రదేశాలకు తిరిగి వేరే పేర్లు పెట్టాలని భావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ యోగి తప్ప మరొకటి కాదని షబ్బీర్‌ అలీ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ మైనారిటీ నాయకులందరూ హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఈ నెల 7న గాంధీభవన్‌లో ప్రమాణస్వీకారం చేయడానికి ముందు నాంపల్లిలోని దర్గా–ఎ–యూసుఫైన్‌ పర్యటన ఏర్పాట్ల గురించి సమావేశం చర్చించింది.