ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి జర రిలీఫ్

revanth reddy vote for note case revanth reddy case vote for note case in supreme court sandra venkata veeraiah

0
126

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ధీటైన నేతగా ఉన్నారు రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీద ఉన్న ఓటుకు నోటు కేసులో వేగంగా కదలికలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నరేవంత్ రెడ్డి మీద న్యాయస్థానంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఇక రేవంత్ కేసు వేగంగా జరుగుతుందన్న ప్రచారం సాగింది. అయితే రేవంత్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో జర్రంత రిలీఫ్ దక్కింది.

 

ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ను ఆపాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు తెలంగాణ ఎసిబికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిలుపుదల చేయాలంటూ గవాయ్, సూర్యకాంత ధర్మాసనం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఈ విషయంలో ఈడి ఛార్జిషీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఎసిబి విచారణ వేగవంతం చేయనుందన్న ప్రచారం నడిచింది. ఈడి దాఖలు చేసిన ఛార్జిషీట్ లో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చూపింది. ఆయనతోపాటు ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, రుద్ర విజయ్ సింహా, జెరూసలెం మత్తయ్య, వేం కృష్ణ కీర్తన్ (వేం నరేందర్ రెడ్డి తనయుడు)ల మీద అభియోగాలను మోపింది ఈడి. ఎసిబి నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసింది.

 

2015లో జ.న్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడం, లేదా ఓటింగ్ కు దూరంగా ఉండడం చేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలను రేవంత్ రెడ్డి ఇవ్వజూపగా ఎసిబి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడు ఎసిబి విచారణ వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ను ఆపుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పేరును మాత్రం ఈడి అభియోగపత్రంలో పొందుపరచలేదు. ఆయనకు పెద్ద ఊరటే లభించిందని చెప్పవచ్చు. ఆయన ఫోన్ ఆడియో రికార్డులను పరిశీలించినా నేరం నిరూపణ కాలేదని తెలుస్తోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ సినిమాను తలపిస్తోందని జనాలు చర్చించుకుంటున్నరు.