టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని నిన్నకాక మొన్న కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాడి కౌషిక్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పంచారు. సోమవారం పాడి కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సమయంలో ఆయన మీడియాతో అనేక అంశాల మీద మాట్లాడారు.
రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు మాణిక్ ఠాగూర్ కు ఇచ్చి పిసిసి చీఫ్ పదవి కొట్టేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా వారిని పక్కనపెట్టడం వెనుక మతలబు ఇదే అన్నారు. ఎందరో అనుభవజ్ఞులు, మాజీ మంత్రులు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటికీ టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో హల్ చల్ చేసే ముమైత్ ఖాన్ కు రేవంత్ రెడ్డికి పెద్దగా తేడా లేదని ఎద్దేవా చేశారు కౌషిక్ రెడ్డి. కొంత మంది తన మనుషులకు డబ్బులు ఇచ్చి ప్రోగ్రాం కి పిలిపించుకుని సిఎం.. సిఎం… అని నిదాలు చేయించుకుంటూ రోజులు గడుపుతున్నాడని రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
తన రాజీనామాకు, తన సోదరుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని కౌషిక్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లో ఎవరు ఎవరిని ప్రభావితం చేయలేరని, సొంత అన్నదమ్ములే వేర్వేరు పార్టీలో ఉన్న వారు లేరా అని ప్రశ్నించారు.
కౌషిక్ రెడ్డిని బహిష్కరిస్తున్నామ్ : టిపిసిసి
మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. టిఆర్ఎస్ తో కుమ్మక్కై కోవర్ట్ గా మారి కాంగ్రెస్ పార్టీ కి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్లు కోదండరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.