ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. ఈనెల 23న ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన..మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. దయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు.
స్పందించిన సీఎం వైయస్ జగన్ త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్పుతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం వైయస్ జగన్ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి హామీ ఇచ్చారు.