‘వరద బాధితులకు తక్షణమే రూ.25 వేలు ఇవ్వాలి’

0
99

రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్బంగా వరద బాధితులకు హేతుబద్ధమైన పరిహారమిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. మీరు ప్రతిపక్షంలో రూ.25 వేలు డిమాండ్ చేసి… ఇప్పుడు రూ.2 వేలు ఇస్తారా? అని వైసిపిని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నిలదీశారు.

గోదావరి వరదల మూలంగా నిరాశ్రయులైనవారు, రైతాంగం, పేదలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లపైనా, వారిని ఆదుకోవడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి జనసేన పార్టీ తరఫున విజ్ఞాపన అందచేస్తామని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన ఇవ్వాలని నిర్ణయించాం. విజ్ఞాపన తీసుకొని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన తెలియచేస్తామన్నారు. రాజమండ్రిలో సోమవారం జనసేన పార్టీ నేతలతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ..“మంచి పరిపాలకుడు అంటే ప్రమాదం వచ్చిన తర్వాత పరామర్శించడం కాదు. ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ప్రజలను కాపాడుకోవడమే సుపరిపాలకుడి లక్షణం. గోదావరి వరద బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరి నదికి వస్తున్న భారీ వరదలు అప్రమత్తత లోపించడం వల్ల ప్రజలను నిలువునా ముంచేశారు. గోదావరి వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది. కేవలం బాధిత కుటుంబాలకు 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసింది. ఇదే వైసీపీ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గోదావరికి వరదలు వస్తే బాధితులకు 25 వేల రూపాయల తక్షణ సాయం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధితులకు రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వస్తున్న ముఖ్యమంత్రిని జనసేన పార్టీ తరఫున తాము కలిసేందుకు ఇప్పటికే అధికారులను అనుమతులు అడిగాం. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాం. అయితే ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వాతావరణ శాఖను, విపత్తుల నిర్వహణ శాఖలను సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరికి ఎంత వరద వస్తుందో అంచనా వేయడంలోనూ ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతోంది.

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారి ఆస్తులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. సాక్షాత్తు మంత్రులే వరద ఇంత వస్తుంది అని ఊహించలేమని చెప్పడం వారి పాలనకు నిదర్శనం. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆగస్టులో ఎక్కువగా గోదావరి కి వరద వస్తుందని భావిస్తుంటారు. అయితే ఈసారి జులైలోనే భారీగా వరద వచ్చింది. ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాన్ని అంచనా వేసి ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రలో ఉండిపోయింది. వరద వచ్చిన తర్వాత బాధితులను ఆదుకోవడంలో కానీ, రక్షించడంలో కానీ ప్రభుత్వం చొరవ చూపలేదు.

అవసరమైన సమయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి అధికారులను అప్రమత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి తీరిగ్గా, వరద మొత్తం తగ్గిన తర్వాత పర్యటనకు రావడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ముఖ్యమంత్రికి పేదల బాధలు పట్టవు. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు ఈ పాలకులకు అవసరం లేదు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో శాఖలను సమన్వయం చేయడంలో ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పూర్తిగా గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, కనీసం ముఖ్యమంత్రిని కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వని పక్షంలో కోనసీమ జిల్లా గంటి పెదపూడలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమం పట్ల నిరసన వ్యక్తం చేస్తాం. ముంపు బారిన పడిన ఒక్కో కుటుంబానికి తక్షణం రూ.పది వేలు సహాయం ప్రకటించాలి. అలాగే ముంపు గ్రామాల్లో పంట నష్టాన్ని మదింపు చేసి, ఆ మేరకు ఆర్థిక సహాయం అందించాలి.

ప్రభుత్వం చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్.ఆర్. ప్యాకేజీని తక్షణం విడుదల చేసి, సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించాలి” అని దుర్గేష్ అన్నారు. ఈ సమావేశంలో మేడా గురుదత్ ప్రసాద్, అత్తి సత్యనారాయణ, వై.శ్రీనివాస్, గంటా స్వరూప, తేజోమూర్తుల మూర్తి,  జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.