Flash news: రూ.500 గ్యాస్ సిలిండర్

0
110

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడమే టార్గెట్ గా ఆయన చేసిన ప్రకటనలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఆయన ఇచ్చిన హామీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ నుండి యధేచ్చగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. అయినా ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. నిరసన తెలిపే ముందు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రాష్ట్రం గుజరాత్ అని, ఎవరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామో వారి నుండి పర్మిషన్ తీసుకోవాలట అని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తోంది తప్ప.. రైతు రుణాలను మాఫీ చేసినట్లు ఎక్కడ కనిపించడం లేదని మండిపడ్డారు. సర్దార్ పటేల్ రైతుల గొంతుకగా నిలిచారని.. ఒక వైపు బీజేపీ ఆయన ఎత్తైన విగ్రహాన్ని తయారు చేస్తూనే మరో వైపు ఆయన ఎవరి కోసం పోరాటం చేశారో వారికి వ్యతిరేకంగా పని చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో ఎల్పీజీ సిలిండర్ ధరలు ఆకాశానంటుతున్నాయని, ప్రస్తుతం రూ.1000 దాటిపోయిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఆకర్షించేలా సంచలన హామీలు కురిపించారు.