హైదరాబాద్: తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో..ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి. బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీ బస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సులకు కూడా ఇవే రంగులుండేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. ఈ సమయంలోనే నగరంలో ఆకుపచ్చ, పెసర రంగు కాంబినేషన్‌లో ఉండే రంగులు కూడా మారి ఎరుపు రంగు వచ్చింది.
దశాబ్దంనర పాటు ఆ రంగు చూసి జనానికి బోర్ కొట్టి ఉంటుందన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకోసం జనాన్ని ఆకట్టుకునే రంగుల్లోకి వాటిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో బాగా ఆకట్టుకున్న ఆకుపచ్చ-పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. ఓ బస్సుకు ఆ రంగు వేయించారట. మరో ఎనిమిది కాంబినేషన్లతో రంగులు వేయించి మెరుగ్గా ఉన్న దాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా బస్సుల రంగులు కూడా మార్చే అవకాశం లేకపోలేదు.