జూన్ 15 నుంచి వానాకాలం రైతుబంధు డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఈ ప్రక్రియ జూన్ 15న మంగళవారం స్టార్ట్ అవుతుంది. అయితే అదేరోజు రైతులందరికి ఖాతాలోకి డబ్బు వచ్చి చేరుతుందనుకుంటే పొరపాటే. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా చేరుతాయో ఒకసారి చదవండి.
రైతుబంధు కింద ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేసే సొమ్ము రైతులందరికీ మొదటిరోజే బ్యాంకు ఖాతాల్లోకి జమ కాదు. తొలిరోజు ఎకరం లోపు భూమి ఉన్న రైతులందరికీ నగదు బదిలీ చేస్తారు. వీరి సంఖ్య సుమారు 18 లక్షల మంది వరకు ఉంటారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి 10.50 లక్షల (పదిన్నర లక్షల) ఎకరాల విస్తీర్ణానికి తొలిరోజు సుమారు 525 కోట్ల రూపాయలను చెల్లించనున్నారు.
ఇక రేపు అంటే జూన్ 16న రెండెకాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతుబంధు కింద నగదు బదిలీ జరపనున్నారు. మూడో రోజు అంటే జూన్ 17వ తేదీన మూడెకరాల లోపు ఉన్న రైతులకు నగదు బదిలీ జరుగుతుంది. అలాగే పదో రోజు వరకు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు పంపిణీ జరుగుతుంది. 11వ రోజు నుంచి 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తారు.
రైతుబంధు నగదు పంపిణీ ప్రక్రియను 11 రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు లబ్ధిదారుల సంఖ్యను 63,25,695 గా నిర్ణయించారు. వీరి ఆధీనంలో ఉన్న 150.18 లక్షల ఎకరాలకు గాను 7,508.78 కోట్ల రూపాయలను చెల్లించనున్నారు.
రైతుబంధు నిధులు ఖాతాలో జమ అయిన తర్వాత వ్యవసాయ శాఖ నుంచి, రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి రైతుల సెల్ నెంబర్లకు మెసేజ్ వస్తుంది. ఇదీ రైతుబంధు ద్వారా నగదు పంపిణీ ప్రొసీజర్.
నగదు జమ కాగానే ఫోన్ కు ఈ కింద ఉన్న మెసేజ్ వస్తది. మెసేజ్ వచ్చిందటే మీ ఖాతాల డబ్బు పడ్డట్లే