బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలిటికల్ ఎంట్రీ పై సంజయ్ దత్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేశారు. సంజయ్ దత్ ఇటీవల రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను కలిశారు.ఆ తరువాత మీడియా ముందుకొచ్చిన మహదేవ్ జంకర్ సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ తన పార్టీ చేరబోతున్నట్లు తేదీ కూడా ఖరారు చేశారు.
అయితే జంకర్ చెప్పిన మాటల్లో నిజం లేదని సంజయ్ దత్ అంటున్నాడు. ”నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుదిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
పదేళ్ల క్రితం సంజయ్ సమాజ్ వాది పార్టీ తరఫున లక్నో నుండి పోటీ చేశారు. ఆ తరువాత అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి తిరిగొచ్చిన సంజయ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.