తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇక తాజాగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్బంగా బడంగ్‌పేట్ మేయర్ పారిజాత, పలువురు తెరాస నేతలు రేవంత్ రెడ్డి నేతృత్వంలో దిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామంటున్న తెరాస నేతలు.. కనీసం రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చటం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను కీలక నగరంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచారు. సామాన్య ప్రజలకు బతకడమే భారంగా మారింది. దేశ సరిహద్దుల్లో రక్షణ లేకుండా పోయింది.
అదే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్పులపాలైంది. అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరింది. ఈ అంశాలన్నింటిపైనా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని రాహుల్‌గాంధీ సూచించారు. తెలంగాణను ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా మాపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.