Breaking news: రాజ్ భవన్ వద్ద పోలీసులకు షాక్

0
185

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) వరుసగా మూడో రోజు విచారించింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి, పలు కీలక విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రోజుల్లో రాహుల్​ను ఇప్పటికే 24 గంటలకు పైగా విచారించారు అధికారులు.

మరోవైపు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్​ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసనల్లో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ నేతలు, కార్యకర్తలు గురువారం ఉదయం రాజ్‌భవన్‌ను ముట్టడించారు. అకస్మాత్తుగా రాజ్‌భవన్ ఎదుటకు చేరుకున్న వారు ప్రధాన గేటు వద్ద బైఠాయించి కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఊహించని విధంగా ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు రాజ్‌భవన్‌ గేటు వరకు చేరుకోవడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.