మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పీసీసీ రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో మాకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా? కాంగ్రెస్‌లో ఎందరో సీనియర్లు ఉన్నా ఆయనకెలా పీసీసీ వచ్చింది? నిన్న పీసీసీ హోదాలో నాపై చేసిన విమర్శలు బాధ కలిగించాయి.
‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి సహకరించా. ఈ మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడా. 2014 తర్వాత పార్టీ పదవులు ఇవ్వకపోయినా కష్టపడ్డా. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. నేను ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదు. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే రాజీనామా చేసి.. భాజపాలోకి వెళ్తున్నాను. ప్రధాని మోదీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.