పర్యాటకులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్‌..స్పెషల్ ప్యాకేజీ ప్రకటన

State Government Good News for Tourists..Special Package Announcement

0
88

ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తాజాగా పాపికొండలకు వెళ్లే పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తెలిపారు.

పాపికొండల టూర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ నెల 24వ తేదీ నుంచి పర్యటనను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999గా ధరను నిర్ణయించారు.

మరోవైపు గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నుంచి నాగార్జునకొండకు బోటు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులకు అనుమతులు మంజూరు అయ్యాయని చెప్పారు అధికారులు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులనే కొండకు తీసుకెళ్తున్నామని, వారం రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

భద్రతా కారణాలతో గత రెండేళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ బోట్లు నిలిపేవేసింది ఏపీ సర్కార్. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులనే కొండకు వెళ్లేందుకు అనుమతి రాగా, వారి కోసమే బోటు నడిపారు. అటు త్వరలో తెలంగాణ నుంచి కూడా నాగార్జున కొండకు సర్వీసులు స్టార్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.