ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వ్యక్తి రఘురామ కృష్ణంరాజు తనయుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిఎం జగన్ ఒకవైపు రాష్ట్రంలో టిడిపి నేతల మీద ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు రఘురామరాజు మాత్రం జగన్ కు చుక్కలు చూపించారు. అయితే తాజాగా రఘురామ తనయుడు భరత్ సుప్రీంకోర్టులో తన తండ్రి విషయంలో వేసిన పిటిషన్ లో ఆయనకు చుక్కెదురైంది. వివరాలు ఇవీ…
పోలీసులు తన తండ్రి రఘురామ కృష్ణంరాజు కొట్టారంటూ భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ విచారణ జరపాలని ఆయన అభ్యర్థించారు. ఆ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది.
అయితే ప్రతివాదుల జాబితాలోంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిఎం జగన్ మోహన్ రెడ్డిని, సిఐడి అధికారుల పేర్లను సుప్రీంకోర్టు తొలగించింది. కేవలం ప్రతివాదుల లిస్టులో కేంద్ర ప్రభుత్వం, సిబిఐ లను మాత్రమే ఉంచింది.
ప్రతివాదుల లిస్టు లోంచి ఎపి ప్రభుత్వం, సిఐడి, సిఎం లను తొలగించడం పట్ల భరత్ న్యాయవాది దవే అభ్యంతరం లేవనెత్తారు. కానీ న్యాయస్థానం వారి అభ్యంతరాన్ని పట్టించుకోలేదు. దీంతో కేంద్రం, సిబిఐ ఇచ్చే వివరణ ఆధారంగా రఘురామను కొట్టినట్లు వేసిన పిటిషన్ లో సిబిఐ విచారణ అవసరమా? లేదా అన్నది తేలే అవకాశం ఉంది.