సైకిల్ ఎక్కనున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

0
109

తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఎంపికైన రేవంత్ రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు. సైకిల్ ఎక్కడం అంటే కొంపదీసి మళ్లీ టిడిపి లో చేరతారా ఏంటి అని అనుకునేరు. అదేం కాదు… పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీ జరపనున్నారు.

ఈ నెల 12న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈమేరకు పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన యదాతదంగా…

పెట్రో ధరలు మండిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. సామాన్యుడి కొంపలో కుంపట్లు రగులుతున్నాయి. పేదోడ్ని కొట్టి పెద్దలకు పెడుతున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ కదం తొక్కింది. సామాన్యుడికి అండగా, పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిగారి అధ్వర్యంలో జరగనున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా జులై 12 సోమవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చింది.

ఈ ఆందోళనా కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఐదు కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డిగారు సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిగారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. నిర్మల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శంఖారావం పూరించనున్నాం.

కనుక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో… ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఇంఛార్జిలు, ముఖ్యనాయకులతో సమన్వయం చేసుకుని ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ప్రధాన పట్టణాలలో ఐదు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీలు తీయాలని కోరుతున్నాం. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అడ్డగోలు ట్యాక్సుల వసూళ్లను వ్యతిరేకిస్తూ సామాన్యులకు కాంగ్రెస్ ను చేరువ చేసేలా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, పార్టీ సైనికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఇంఛార్జీలను నియమించడం జరుగుతుంది. ఆ ఇంఛార్జిల లిస్టును ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిగారు రేపు (జులై 9న) మీడియాకు రిలీజ్ చేయడం జరుగుతుంది.

ఇట్లు
ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్