చిదంబరం అరెస్టుపై తమిళనాడు నిరసనలు

చిదంబరం అరెస్టుపై తమిళనాడు నిరసనలు

0
90

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్ధికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చిదంబరం అరెస్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసులు సత్యమూర్తి భవన్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి, కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాయపేట రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఉదయం పది గంటలకు నగరం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రముఖులు సత్యమూర్తి భవన్కు చేరుకున్నారు. 11 గంటలకు సత్యమూర్తి భవన్ నుంచి కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరి అన్నాసాలైలో రాస్తారోకో నిర్వహించనున్నట్టు టీఎన్సీసీ నేతలు ప్రకటించారు. అయితే పోలీసులు రాస్తారోకోకు అనుమతి లేదని, సత్యమూర్తి భవన్ దాటుకుని రోడ్డుపైకి వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కుమరి అనంతన్ నాయకత్వంలో కార్యకర్తలంతా సత్యమూర్తి భవన్ నుండి ఊరేగింపుగా అన్నాసాలై వైపు బయలుదేరారు.

’మోదీ డౌన్.. డౌన్, తప్పుడు కేసులు బనాయించొద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కార్యకర్తలంతా మూకుమ్మడిగా సత్యమూర్తి భవన్ ప్రధాన ప్రవేశద్వారం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాలను సాగనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తొక్కిసలాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు ఇనుమ బారికేడ్లను దాటుకుని రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై కూర్చుని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కార్యకర్తలు రాస్తారోకో జరిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపన్నా, రాయపురం మనో, రంగభాష్యం, వి. బలరామన్, సెల్వం, తనికాచలం, శివరాజశేఖర్, వీరపాండియన్, సుకుమార్దాస్, జీకే దాస్, అగరం గోపి, చూళై రాజేంద్రన్, తమిళ్సెల్వన్, విజయన్, కడల్ తమిళ్వానన్, ఎగ్మూరు దినేష్, అబ్దుల్ రహ్మాన్ తదితరులు ధర్నాకు దిగారు. పోలీసులు వీరితోపాటు 200 మంది కార్యకర్తలను అరెస్టు చేసి, రాయపేటలోని సామాజిక కేంద్రానికి తరలించారు. ఈ ఆందోళన కారణంగా సత్యమూర్తి భవన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశధోరణిని అవలంబిస్తూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంలో ఆయన చట్ట ప్రకారం పోరాడి విడుదలవుతారనే నమ్మకం తనకుందని స్టాలిన్ పేర్కొన్నారు.