ఏపీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. టీడీపీ నేత వర్ల రామయ్య తన భార్యతో కలిసి 12 గంటల దీక్షకు దిగిన విషయం తెలిసిందే. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబాన్ని అసెంబ్లీలో కించపర్చినందుకుగాను సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని ఆయన చెప్పారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ మేనత్తపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని వర్ల రామయ్య అన్నారు.
సినిమాల కోసం నందమూరి కుటుంబాన్ని, నైతిక విలువలను జూనియర్ ఎన్టీఆర్ వదులుకుంటారా? అని ఆయన నిలదీశారు. సినిమా కెరీర్‌లో ఉన్న వారికి అమ్మ, అక్క, చెల్లి, మేనత్త, బావ, వదిన అనే వారు అక్కర్లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ 75 ఏళ్ల ముసలివాడిలా నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు.
సినిమా కెరీర్ ఉంది కాబట్టి ఈ విషయంపైన స్పందించరా? అని వర్ల రామయ్య నిలదీశారు. అవసరమైన సమయంలో మాట్లాడతానని ఎన్టీఆర్ గతంలో అన్నాడని, కానీ ఇప్పుడు మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినా మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు.
సినిమా కెరీర్ ఉన్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు వరదలు వస్తే ప్రజల కోసం విరాళాలు సేకరించారని ఆయన చెప్పారు. నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడే అయినప్పటికీ, మేనల్లుడిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదల కానుందని, అయినప్పటికీ ఆయన గట్టిగా మాట్లాడారని ఆయన చెప్పారు.
మేనత్తపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీనిపై స్పందించాలని తాము జూనియర్ ఎన్టీఆర్ ను అడగాలా? అని ఆయన నిలదీశారు. స్పందించాల్సిన అవసరం ఎన్టీఆర్ కు లేదా? అని నిలదీశారు. హరికృష్ణే కనుక ఇప్పుడు ఉండి ఉంటే మరో సీతయ్యలా మారి వైసీపీ నేతలపై విరుచుకుపడేవారని వర్ల రామయ్య అన్నారు. బాలకృష్ణ కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారని ఆయన చెప్పారు.