షర్మిల అలా.. రేవంత్ రెడ్డి ఇలా.. : ఇద్దరిపైనా తెలంగాణవాదుల గుస్సా

0
110

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రేవంత్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆకాశమే హద్దు అన్నట్లుగా అట్టహాసంగా సాగింది. వరుణదేవుడి కరుణ కూడా ఉందని పార్టీ నాయకత్వం పొంగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ… తెలంగాణవాదులను మాత్రం రేవంత్ రెడ్డి సంతృప్తి పర్చలేకపోయారని గుస్సా ఉన్నారు. 

రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం పెద్దమ్మతల్లి దేవాలయంలో పూజలు చేసి అక్కడి నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. మధ్యలో మసీదులోకి వెళ్లారు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి నాంపల్లి మీదుగా ర్యాలీ సాగింది. మధ్యాహ్నం టైం అయిపోతుందని బుల్లెట్ మీద వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తర్వాత మళ్లీ ర్యాలీ కంటిన్యూ చేశారు.

తెలంగాణ అమర వీరుల గురించి తన ఉపన్యాసంలో గంభీరంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ సాకారమైందన్నారు. కానీ తెలంగాణలో అమరులు ఆశించిన పాలన సాగుతలేదని విమర్శించారు. అయితే అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు మాత్రం రేవంత్ రెడ్డి వెళ్లే ప్రయత్నం చేయలేదు. మార్గమధ్యలో కాదనుకుంటే… ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అయినా.. అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఉండాల్సింది కదా అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. 

టిపిసిసి అధ్యక్షులు గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన నాటినుంచి పదవీ బాధ్యతలు చేపట్టే నాటి వరకు ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోలేకపోయారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో తెలంగాణవాదుల నుంచి రకరకాలైన విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర నేతల కనుసన్నల్లో రేవంత్ పనిచేస్తున్నారని, తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తే వారు అంగీకరించలేదేమో అంటూ తెలంగాణ వాదులు కామెంట్స్ చేస్తున్నారు.

నిన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గురువారం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో సైతం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కానీ గన్ పార్కు అమరుల స్థూపానికి మొక్కలేదని వారు అసంతృప్తితో ఉన్నారు. గన్ పార్కు అమరవీరుల స్థూపం అనేది తెలంగాణవాదులకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. తెలంగాణలో ఏ పార్టీ నాయకులైన గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాతే కార్యక్రమాలు షురూ చేస్తారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలంతా అమరవీరుల స్థూపాన్ని దర్శించుకుంటారు.

షర్మిల సక్కదనం బాలేదు :

తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన  వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల సైతం అమర వీరుల స్థూపాన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. కానీ ఆమె అమరవీరుల స్థూపాన్ని తాకడాన్ని, దర్శించుకోవడాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో పెట్టే పార్టీని రాయలసీమలో ఓపెనింగ్ చేసే షర్మిలకు అమర వీరుల స్థూపాన్ని దర్శించుకునే అర్హత లేదని.. శ్రీనివాస్ అనే మలి తెలంగాణ ఉద్యమకారుడు వ్యాఖ్యానించారు. 

మొత్తానికి అమరవీరుల స్థూపం వద్దకు షర్మిల రావడాన్ని, రేవంత్ రెడ్డి రాకపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏ అధికారిక కార్యక్రమం అయినా సరే ఇక్కడినుంచే చేపడతామని ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ప్రకటించారు. కానీ అధికార పార్టీ పెద్దలు కూడా తొలుత చెప్పిన రీతిలో తగిన గౌరవం ఇవ్వడంలేదని తెలంగాణవాదులు ఆవేదన చెందుతున్నారు.