నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మండలి ఎజెండాను ఖరారు చేశారు.
ఇందులో ప్రధానంగా అదనపు ఆదాయవనరుల సమీకరణకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు అనాథలకు భరోసా, వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏండ్లకు తగ్గింపు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల, పలు ఉత్తర్వులకు ఆమోదం వంటి తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
మునుగోడులో ఉప ఎన్నికల వేడి మొదలుకావడంతో మంత్రిమండలిలో అధికారిక ఎజెండా ముగింపు అనంతరం దానిపైనా సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రిమండలిలో చర్చించాల్సిన అంశాలపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, తమ కార్యాలయ అధికారులతో సమావేశమై చర్చించారని సమాచారం.