తెలంగాణలో కరోనా మరణాలు 3వేలు కాదు, లక్షన్నర : దాసోజు శ్రవణ్ సంచలనం

0
73

‘తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో దాదాపు లక్షా యాబై వేలమంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం 3651 మంది మాత్రమే చనిపోయారని దొంగలెక్కలు చెబుతుంది. ప్రభుత్వ అసమర్ధతని కప్పి పుచ్చుకోవడం కోసం మరణాలని తక్కువగా చేసి చూపడం న్యాయమా కేసీఆర్ ?” అని నిలదీశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. కరోనాతో చనిపోయివారి కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆరు వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఆదేశించింది. ఈ నేపధ్యంలో విలేఖరు సమావేశం ఏర్పాటు చేసిన దాసోజు శ్రవణ్ సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

సుప్రీమ్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో బాదిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల అసలు సంఖ్య బయటకి రావాల్సివచ్చింది. కరోనాలో వైద్యం అందకా, ఆక్సిజన్ అందకా ప్రజలు పిట్టాల్లా రాలిపోతే .. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం 3561 మాత్రమే చనిపోయారని తప్పుడు లెక్కలు చెబుతుంది. టీఆర్ఎస్ సర్కార్ దొంగలెక్కలు చెబుతుందనే సంగతి జిహెచ్ఎంసి లో అందుబాటులో వున్న డేటా ఆదారంగానే అర్ధం చేసుకోవచ్చు. కేవలం జిహెచ్ఎంసీ పరిదిలో 2017లో 50714 మరణాలు సంభవించాయి. 2018లో 53033, 2019లో 64166, 2020లో 76375, 2021 జూన్ 30 నాటికి 47472 మరణాలు సంభవించిననట్లు జిహెచ్ఎంసి గణాంకాల్లో ఇచ్చారు. 2017, 2018, 19 ఈ మూడేళ్ళ యావరేజ్ తీసుకుంటే ఏడాది 55791 మరణాలు. కానీ 2020లో 76375 , 2021 జూన్ 30 నాటికే 47472 మరణాలు .. ఈ ఆకస్మిక మరణాల పెరుగుదలకు కారణం కరోనా స్పష్టంగా తెలుస్తుంది” అని వివరించారు దాసోజు.

”ఈ లెక్కలన్నీ హాస్పిటల్ లో చనిపోయి డెత్ సర్టిఫికేట్ కోసం అర్జీ పెట్టుకున్న వివరాలు మాత్రమే. ఆక్సిజన్, వైద్యం అందక అనేక మంది ఇంట్లోనే చనిపోయారు. అనేక మరణాలు డాటాలోకి రాలేదు. వున్న డాటా ప్రకారం కేవలం 1/3 జనాభావున్న గ్రేటర్ లోని ఆరు నెలల వ్యవధిలో 47472 మరణాలు సంభవిస్తే 2/3 జనాభా కలిగిన మిగిలిన తెలంగాణలో ఇంకెన్ని మరణాలు సంభవించి వుంటాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తమ అసమర్ధతని కప్పిపుచ్చుకోవడానికి మరణాలని తక్కువ చూపిస్తుంది. అందుబాటులో వున్న డాటా ప్రకారం చూసుకున్నా రాష్ట్రం మొత్తంమ్మీద లక్షా యాబైవేల కరోనా మరణాలు సంభవించివుంటాయి. సుప్రీం ఆదేశాలు ప్రకారం వీరందరికీ ఆర్ధిక సాయం అందాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3561మరణాలు మాత్రమే అని చెబుతుంటే మిగతా వారికి ఎవరు న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు దాసోజు.

”ప్రభుత్వం గొప్పలకు పోవద్దు. సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు బాదిత కుటుంబాలందరికీ న్యాయం జరగాలంటే అసలు సంఖ్య బయటికి రావాలి. కోవిడ్ మరణాలపై ఐసిఎంఆర్ స్పష్టమైన గైడ్లెన్స్ ఇచ్చింది. ఎన్ని కోమార్బిడిటీస్ వున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వున్న ఎవరూ చనిపోయినా, నెగిటివ్ వచ్చి కరోనా లక్షణాలతో చనిపోయినా దానిని కోవిడ్ మరణంగానే చూడాలని ఐసిఎంఆర్ గైడ్లెన్స్ ఇచ్చింది. దీనికి కూడా తెలంగాణ ప్రభుత్వం అతిక్రమించింది. చావు పై అబద్దాలు ఆడకూడదని రాజ్యంగంలో 21వ ఆర్టికల్ లో వుంది. ఒక వ్యక్తి ఎలా చనిపోయాడనే విషయం పై అబద్దం ఆడకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన ఈ హక్కుని కూడా ఉల్లఘించించింది. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమైయింది. కనీస మందులు, ఆక్సిజన్ అందించలేకపోయింది. చివరికి మరణాలపై దొంగ లెక్కలు చెప్పి బాదిత కుటుంబాల్లో నోట్లో మట్టికొడుతుంది. ఇదేం దుర్మార్గం. తెలంగాణ సమాజం ఏం పాపం చేసింది కేసీఆర్ ? ఇలా దొంగలెక్కలు చెబుతున్న వారిపై కేసులు పెట్టాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగోలకి పోవద్దు. కేంద్రం ఇవ్వబోతున్న పరిహారం అందరికీ అందాలంటే అసలు మరణాలు సంఖ్య బయటికి రావాలి. ఒక ఆడిట్ ఏర్పాటు చేయండి. కరోనా కాలంలో జరిగిన చావులన్నీటి పై రిపోర్ట్ తయారుచేసి ఐసిఎంఆర్ గైడ్లెన్స్ ప్రకారం .. కరోనా పాజిటీవ్ వున్న ప్రతి చావుని కరోనా డెత్ లో చేర్చండి” అని కోరారు దాసోజు.

కోవిడ్ కారణంగా అనేక మంది రైతులు కూడా చనిపోయారు. ఏ కారణంతో చనిపోయిన రైతు భీమా పధకం కింద రూ. 5లక్షలు ఇవ్వాలని భీమాలో వుంది. కాబట్టి రైతు భీమా పధకం లో నమోదు కాబడ్డ రైతులుకి 5లక్షలు చెల్లించాలి. వారి కుటుంబాలు అర్జీ పెట్టుకోవడానికి వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టి కోవిడ్ వలన చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేకూర్చాలి. ఇక జన ధన్ పధకంలో కూడా బ్యాంకు ఎకౌంట్ తో లింక్ వున్న ప్రతి ఒక్కరికి ఆర్ధిక సాయం అందే అవకాశం వుంది కాబట్టి ఆ పధకం ద్వారా కూడా లభ్ది చేకూరేవిధంగా చర్యలు చేపట్టాలి. ప్రజలకు ఆర్ధిక సాయం అందే వరకూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రభుత్వం చావు లెక్కలు సరిదిద్ది ప్రజలకు మేలు చేసే వరకూ మా పోరాటం ఆగదు” అని వెల్లడించారు దాసోజు.