తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం..ఆ తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు

0
73

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో ఈనెల 30 వరకు స్కూళ్లు బంద్ కాగా ప్రత్యామ్నాయ క్లాసులపై ఓ నిర్ణయానికి వచ్చింది సర్కార్. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనుంది.

ఈ మేరకు 8, 9, 10 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు స్కూల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ దేవసేన. 50 శాతం టీచర్లు విధులకు హాజరుకావాలని ఉత్తర్వులిచ్చారు. ఇక మేలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని, సిలబస్‌ తగ్గించి, పరీక్ష పత్రంలో ఛాయిస్‌ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీచర్లతో పాటు ఇతర సిబ్బంది హాజరు విషయంలోనూ తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం టీచర్లు విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎల్లుండి నుంచి తెలంగాణలో మళ్లీ స్కూల్లు తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం టీచర్లు మాత్రమే స్కూళ్లకు హాజరు కానున్నారు.

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు కోసం అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు టీశాట్ ద్వారా తరగతులు బోధించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ ఫాలో అయ్యి తరగతులు వినాలని సూచిస్తున్నారు. అయితే, మొదట ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే, కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆ సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నెల 31 తర్వాత కూడా మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. రోజు రోజుకూ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడమే ఇందుకు కారణం.

అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 31 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్ని జాగ్రత్తలు తీసుకుని, కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒక వేళ తరగతులు నిర్వహించకపోతే ఈ ప్రభావం పరీక్షలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు.