విద్యా సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్‌పై రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.
పాఠశాలల్లో అక్కడక్కడా స్పల్పంగా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.