తెలంగాణలో కరోనా కట్టడికి హెలిక్యాప్టర్ సేవలు

telangana govt uses helicopter services for covid control

0
94

కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా హెలిక్యాప్టర్ సేవలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు హెలిక్యాప్టర్లో చక్కర్లు కొడుతూ కరోనా ప్రభావిత జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లిలో హెలిక్యాప్టర్ లో పర్యటించారు. కరోనాపై అక్కడి అధికారులతో సమీక్ష జరిపారు.

ఒకవైపు టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు మొట్టికాయలు, మందలింపులతో ఆలస్యంగా టెస్టుల సంఖ్యను అమాంతంగా పెంచింది తెలంగాణ సర్కారు. గతంలో 50, 60 వేల వరకే టెస్టులను పరిమితం చేసిన సర్కారు అవసరమైతే ఇప్పుడు లక్షన్నర వరకు పెంచింది. మరోవైపు జ్వర సర్వే పేరుతో కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నది.

ఇక లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. ఇన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ పది జిల్లాల్లో ఇంకా కరోనా కేసులు 100కు పైగా నమోదు అవుతుండడంతో ఆయా జిల్లాల్లో మరింత దృష్టి సారించింది ప్రభుత్వం. ఆ జిల్లాల్లో రెండోదశ జ్వర సర్వే చేపట్టింది. టెస్టులతో సంబంధం లేకుండా కోవిడ్ లక్షణాలు ఉన్న వారందరికీ మెడిసిన్ కిట్ అందజేస్తున్నారు. తద్వారా కేసులను కంట్రోల్ చేసేందుకు సర్కారు యత్నిస్తున్నది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో వందలోపు కేసులే నమోదవుతున్నాయి. దాదాపు 20 జిల్లాల్లో అయితే ప్రతిరజు కేసులు 30 నుంచి 50 మధ్యలోనే నమోదవుతున్నాయి. జ్వర సర్వే, టెస్టుల సంఖ్య, లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తున్నదని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో హెలిక్యాప్టర్ లో పర్యటించిన అధికారులు తర్వాత మిగిలిన కరోన తీవ్రత జిల్లాల్లో కూడా హెలిక్యాప్టర్ లోనే విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.